జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు

విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
జివిఎంసి దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు 33వ వార్డులో గల బంగారు మెట్ట, వెంకటేశ్వర మిట్ట,గౌరీ స్ట్రీట్, అల్లిపురం మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలలో పర్యటించారు.ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్బ్యాక్‌కు సంబంధించి ప్రజలందరూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. అలాగే ఇంటింటికి వచ్చే సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న సెన్సస్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని సూచించారు.పర్యటనలో భాగంగా గౌరీ వీధి, బంగారు మెట్ట ప్రాంతాలలోని కాలువల్లో చెత్త వేయడం గమనించిన జోనల్ కమిషనర్ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కాలువల్లో చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్‌కు ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.అదేవిధంగా “డ్రై డే ఫ్రైడే” కార్యక్రమంలో భాగంగా బంగారు మెట్ట ప్రాంత ప్రజలు ప్రతి శుక్రవారం నీటి నిల్వలను శుభ్రపరచుకోవాలని సూచించారు. దీనివల్ల మంచినీటిలో పెరిగే దోమలను అరికట్టడంతో పాటు వ్యాధుల నివారణకు సహాయపడుతుందని తెలిపారు.ఈ పర్యటనలో శానిటరీ సూపర్వైజర్ కామేశ్వర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నాజీ రావు, శానిటేషన్ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.