ఇ. రాజేష్‌‌  కు ఘనసన్మానం

సోంపేట, మార్చి 25(స్వతంత్ర ప్రభ)

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిరంతరం కృషి చేస్తూ, ప్రభుత్వానికి శతశాతం ఇంటిపన్నులు వసూలు చేసి ఆదాయం పెంపొందించడంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా మెజర్ గ్రామ పంచాయితీ కార్యనిర్వాహణాధికారి ఇ. రాజేష్‌‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బారువా కొత్తూరు మత్స్యకారుల సంఘం సంయుక్తంగా ఘనంగా సన్మానించింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ సీపాన గుణవతి సూచన మేరకు బుధవారం ఈ సన్మానం నిర్వహించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అడ్వైజర్ లోకినిది గోవిందరాజులు, పలాస సబ్‌ డివిజనల్ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టా పోలయ్య మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఇ. రాజేష్ చూపుతున్న చిత్తశుద్ధి, కార్యదక్షత ప్రశంసనీయమని వారు తెలిపారు. సుదీర్ఘకాలంగా పరిష్కారం కాకున్నా అనేక సమస్యలను ఆయన చాలా తక్కువ కాలంలో పరిష్కరించడం అభినందనీయమని అన్నారు.
బారువా–కొత్తూరు మత్స్యకార ప్రాంతంలోని వీధుల్లో విద్యుత్ బల్బుల ఏర్పాటు, రోడ్ల శుభ్రత, మురికి కాలువల పరిశుభ్రత — ఇలా పంచాయితీ పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో ఆయన సేవలకు సాటి మరెవ్వరూ లేరని మత్స్యకార సంఘం నాయకులు అమర లోకనాధం ప్రశంసించారు.
తూర్పు తీరం అందమైన బారువా సముద్రతీరంలో ప్రతి శుక్రవారం క్లీనింగ్‌ డ్రైవ్ నిర్వహించాలని, అలాగే చారిత్రాత్మకమైన జగన్నాధస్వామి, జనార్ధనస్వామి, శివాలయం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను కట్టుదిట్టంగా పాటించాలని ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోరింది.సన్మానం సందర్భంగా సోంపేట మండల తహసీల్దార్ అప్పలస్వామి, ఈఓ–పీఆర్‌డీ అనమల వెంకట్, బారువా వీఆర్ఓ భగీరథ హర్షం వ్యక్తం చేసి, ఇ.రాజేష్‌కు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ మరియుమత్స్యకార సంఘం నాయకులు ఈరోతు శ్రీనివాసరావు, తోట మాధవరావు, తోట జానకీరావు, గోరఖ ఢిల్లీ రావు, ఎర్ర లోకనాధం, డొంక సునీల్, బడే రాజేష్, ఎస్. ధర్మారావు, రొట్టి వెంకటేష్,తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త తోట శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *