ఐజేయు సెక్రటరీ జనరల్ డి. సోమసుందర్
పశ్చిమ గోదావరి ,జిల్లా బ్యూరో,(స్వతంత్రప్రభ)
ప్రతి వ్యక్తి తాము చేసే పనిలో నాణ్యత, ప్రమాణాలను పాటించినప్పుడే వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుందని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) సెక్రటరీ జనరల్ దూసనపూడి సోమసుందర్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెంలో ఏరియా తాపీ, వడ్రంగి, సెంటరింగ్, రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ.. యూనియన్ పదవులను బాధ్యతగా భావించి సభ్యుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాడుతూనే, స్థానిక కార్మిక సంఘాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.కార్మిక సంఘ నేతలు పాలూరి లక్ష్మణరావు, దువ్వా శ్రీనివాస్, పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలుగా పత్రికారంగానికి సోమసుందర్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగానే ఆయనకు జాతీయ స్థాయి పదవి దక్కిందని కొనియాడారు. సాదాసీదాగా ఉంటూ అందరినీ గౌరవించే ఆయన తత్వం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆదినారాయణ, మాదు శ్రీనివాస్ తదితరులు పాల్గొని సోమసుందర్‌కు మొక్కలను బహూకరించి సత్కరించారు.