
పెదబయలు, అల్లూరి జిల్లా(స్వతంత్ర ప్రభ)
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన చిన్నారులను మృత్యువు కబళించింది. సీతగుంట పంచాయతీ పరిధిలోని పన్నెడా గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు, సమీపంలోని లకేయి పుట్టు గ్రామ శివారులో ఉన్న మత్యాగడ్డలో ఈత కొట్టడానికి వెళ్లారు. నీటిలోకి దిగిన కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు వారు మునిగిపోవడంతో, ఒక చిన్నారి వెంటనే బయటకు వచ్చి గట్టిగా కేకలు వేశాడు. ఆ సమయంలో అక్కడే చేపల వేట సాగిస్తున్న స్థానికులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఒక చిన్నారిని ప్రాణాలతో కాపాడగలిగినప్పటికీ, అప్పటికే గొల్లూరి హర్షిత్ (12), ప్రదీప్ (11), పాంగి బబులు (10) అనే ముగ్గురు చిన్నారులు నీట మునిగి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో పన్నెడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.