
విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతంలోని ఉన్న ప్రముఖక్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు జాతీయ విద్యార్థి దళం (ఎన్.సి.సి) ఎంపికల్లో ప్రతిభ చాటారు. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సీతమ్మధారలోని ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాల వేదికగా నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 25 మంది క్వీన్ మేరీ పాఠశాల బాలికలు ఎంపికయ్యారు.ఈ ఎంపికల్లో మొత్తం 62 మంది విద్యార్థినులు పాల్గొనగా, శారీరక దారుఢ్యం మరియు ఇతర సామర్థ్య పరీక్షల ఆధారంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మందిని విజయనగరం బాలికల విభాగ అధికారులు ఎంపిక చేశారు. పర్యవేక్షకురాలు పల్లవి, శిక్షకులు నాగేశ్వరరావు మరియు భాషా ఈ ప్రక్రియను నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రధానోపాధ్యాయులు జోగేంద్ర నాథ్ ఎంపికైన విద్యార్థినులను అభినందించారు. విద్యార్థి దశలోనే ఇటువంటి శిక్షణ పొందడం వల్ల క్రమశిక్షణ, దేశభక్తి పెరుగుతాయని, భవిష్యత్తులో దేశ సేవలో వీరికి ఉన్నత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినుల ప్రతిభను చూసి ఎంతో గర్వపడుతున్నామని, వారు క్రమశిక్షణతో కూడిన శిక్షణ పొంది పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల పర్యవేక్షకురాలు టి. సంతోషి కుమారి ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.