దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు

విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ ) జీవీఎంసీ దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు 31 మరియు 33వ వార్డుల పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, సౌత్ జైల్ రోడ్, డాబా గార్డెన్స్, వెంకటేశ్వర మెట్ట, బంగారమ్మ వీధి, సింహాల దేవుడు ప్రాంతం, పేర్రాజు వీధి తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి పారిశుధ్య కార్మికులు మరియు చెత్త సేకరణ వాహనాలు క్రమం తప్పకుండా వస్తున్నాయా లేదా అనే విషయంపై ఆరా తీశారు. అదేవిధంగా పారిశుధ్యం, తాగునీరు మరియు ఇతర పౌర సేవలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.కాలువలలో చెత్త వేయడం వల్ల అవి మూసుకుపోయి వర్షాకాలంలో పొంగిపొర్లే ప్రమాదం ఉందని ప్రజలకు వివరించి, కాలువలలో చెత్త వేయకుండా సహకరించాలని సూచించారు. ప్రజల్లో పరిశుభ్రతపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అదేవిధంగా తాగునీటిని వృథా చేయకుండా అవసరం లేని సమయంలో కొళాయిలకు బెరడాలు అమర్చుకొని నీటి వృథాను నివారించాలని ప్రజలకు సూచించారు. ప్రతి కుటుంబం తడి చెత్త మరియు పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ ఉంచి ఇంటింటికీ వచ్చే పారిశుధ్య కార్మికులకు అందజేయాలని కోరారు.
రోడ్లపై చెత్త వేయబడుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలకు జీవీఎంసీ అందిస్తున్న సేవలపై అభిప్రాయాలు, సూచనలు సేకరించేందుకు ప్రతి సచివాలయ పరిధిలో ప్రత్యేక ఫీడ్‌బ్యాక్ కార్యక్రమం నిర్వహించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్, శానిటరీ సెక్రటరీలకు సూచించారు.ఈ కార్యక్రమం అమలుకు అవసరమైన ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించి శానిటరీ సెక్రటరీలకు అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణంరాజు, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ చిన్నాజీ రావు, శానిటేషన్ సెక్రటరీలు, వాటర్ సప్లై అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.