నెల్లూరు, స్వతంత్ర ప్రభ
నగరంలో బాబు జగజీవన్ రామ్ భవనం ఏర్పాటుకు తక్షణమే స్థల సేకరణ చేసి, అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ఆదివారం కస్తూరిబా కళాక్షేత్రంలో నిర్వహించిన జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధునిగా, ఉప ప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు అమోఘమని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.జిల్లా అభివృద్ధిపై తన దార్శనికతను వివరిస్తూ.. జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లను అన్ని వసతులతో కూడిన ‘ఫైవ్ స్టార్’ వసతి గృహాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే, నెల్లూరును పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు ప్రతి నెలా ఒక పరిశ్రమను తెచ్చేలా రెండేళ్ల ప్రణాళిక రూపొందించామని, త్వరలోనే ఉదయగిరి, దుత్తలూరు ప్రాంతాల్లో రెండు మెగా పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, సాంకేతికతను కేవలం జ్ఞాన సముపార్జనకే వాడుకోవాలని, తాను కూడా విదేశీ ఉద్యోగం వదిలి ఆన్లైన్ సాయంతోనే సివిల్స్ సాధించానని స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయ్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.