కలెక్టర్‌కు విజిలెన్స్ కమిటీ సభ్యులు చొక్కాకుల రాంబాబు విన్నపం
విశాఖపట్నం,స్వతంత్ర ప్రభ)
వచ్చే ఏప్రిల్ మాసంలో జరగనున్న జాతీయ నాయకుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచి, సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చొక్కాకుల రాంబాబు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో జాతీయ నాయకులైన స్వర్గీయులు బాబు జగజీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, మరియు భారతరత్న , బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు వస్తున్నాయని గుర్తు చేశారు. జి.వి.ఎం.సి పరిధిలోనూ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పల్లెలోనూ ఉన్న ఈ మహనీయుల విగ్రహాలకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టి, రంగులు వేసి అలంకరించాలని కోరారు.ఈ వేడుకల బాధ్యతను సచివాలయ సిబ్బందికి లేదా కార్పొరేషన్ అధికారులకు అప్పగించి, ప్రభుత్వ పర్యవేక్షణలో అత్యంత ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. “ఈ ముగ్గురు మహనీయులు కేవలం ఎస్సీ, బీసీ వర్గాలకు మాత్రమే చెందిన వారు కాదు.. వారు యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయులు. అందరూ కలిసి ఈ వేడుకలను జరుపుకోవాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా యంత్రాంగం మరియు మున్సిపల్ అధికారులు సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపట్టాలని రాంబాబు కోరారు.