“వేస్ట్ టు వండర్” వ్యర్థాలతో కళాఖండాలు సృష్టించండి లక్ష రూపాయలు గెలవండి!

సౌత్ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు..

విశాఖ దక్షిణం,మార్చి:24(స్వతంత్ర ప్రభ)

జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు, స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “వేస్ట్ టు వండర్” ప్రత్యేక పోటీలకు సౌత్ జోన్ పరిధిలోని అర్హులైన ప్రతిఒక్కరూ విస్తృతంగా స్పందించాలని సౌత్ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు పిలుపునిచ్చారు.నగరంలో వ్యర్థ పదార్థాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, స్క్రాప్ పదార్థాలను సృజనాత్మక కళాఖండాలుగా మలచడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, సుస్థిర వ్యర్థ నిర్వహణకు ప్రాధాన్యత కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. వ్యర్థాన్ని విలువైన వనరుగా మలచే దిశగా జీవీఎంసీ చేపడుతున్న ఈ కార్యక్రమం స్వచ్ఛతతో పాటు నగర సౌందర్యాన్ని కూడా పెంపొందించనున్నదని పేర్కొన్నారు.జీవీఎంసీ పరిధిలోని నమోదిత వెల్డింగ్ షాపులు, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, స్వతంత్ర మెటల్ ఆర్టిస్టులు ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. పోటీ నిబంధనల ప్రకారం, పాల్గొనేవారు 80 శాతం స్క్రాప్ ఐరన్ మరియు ఆటో వ్యర్థ పదార్థాలతో 4 అడుగుల నుండి 8 అడుగుల ఎత్తు గల శిల్పాలను రూపొందించి సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, అనంతరం తయారు చేసిన “వేస్ట్ టు వండర్” కళాఖండాలను 10-04-2026 లోపు సంబంధిత అధికారుల ద్వారా సమర్పించాలని తెలిపారు. అందిన ఎంట్రీలను జీవీఎంసీ ఏర్పాటు చేసే ఎంపిక కమిటీ పరిశీలించి తుది విజేతలను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.ఈ పోటీలో విజేతలకు జీవీఎంసీ తరఫున క్రింది విధంగా నగదు బహుమతులు అందజేయబడతాయని ఆయన తెలిపారు:ప్రథమ బహుమతి – రూ.1,00,000/-ద్వితీయ బహుమతి – రూ.50,000/-తృతీయ బహుమతి – రూ.25,000/-కన్సొలేషన్ కేటగిరీలో ఎంపికైన 10 మందికి తలా రూ.5,000/-…విజేతలుగా ఎంపికైన కళాఖండాలను జీవీఎంసీ స్వాధీనపరచుకుని నగరంలోని ప్రధాన రహదారి కూడళ్లు, ప్రజా ప్రదేశాలు మరియు ప్రాముఖ్యత గల ప్రాంతాలలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో నగర సౌందర్యం పెరగడమే కాకుండా, పర్యావరణహిత ఆలోచనలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. పోటీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు కూడా తెలియజేశారు.ఈ కార్యక్రమానికి సంబంధించి విస్తృత ప్రచారం చేపట్టాలని, అర్హులైన వారందరికీ సమాచారం చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సౌత్ జోన్ పరిధిలోని వెల్డింగ్ షాపులు, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, లోహ కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవీఎంసీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జోనల్ కమిషనర్ శ్రీ ఎం. మల్లయ్య నాయుడు కోరారు.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్:https://forms.gle/XvAfDTY16UGewMLb7

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *