ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి…

నెల్లూరు,(స్వతంత్ర ప్రభ)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 100 రోజుల నీటి సంరక్షణ కార్యక్రమంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డి పాళెం మండలం రేబాల సమీపంలో అమ్మోరి తోపు వద్ద సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో ఇరిగేషన్ సెంట్రల్ ఛానెల్ పూడిక తీత మరియు జంగిల్ క్లియరెన్స్ పనులను ఆమె పర్వేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుండి జూలై 5 వరకు జరిగే ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నీటి భద్రతపై ప్రజలను భాగస్వాములను చేయాలని ఆమె కోరారు. నీటిని పొదుపుగా వాడుకుంటూ ఆయుకట్టులోని చివరి పొలానికి సాగునీరు అందేలా చూడటం మన అందరి బాధ్యత అని, కాలువల్లో సిల్ట్ క్లియరెన్స్ పనులు చేపట్టి నీటి ప్రవాహాన్ని వేగవంతం చేయాలని ఆమె సూచించారు. ముఖ్యంగా పెన్నా డెల్టా పరిధిలోని కాలువలు, షట్టర్ల మరమ్మత్తులు పూర్తి చేసి, చెరువు కట్టలను బలోపేతం చేయడం ద్వారా భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే విపిఆర్ ఫౌండేషన్ మరియు ఎఫ్.డి.ఆర్ నిధులతో చాలా వరకు పూడికతీత పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు గుర్తుచేశారు. గత రబీ సీజన్‌లో పంటలు సమృద్ధిగా పండాయని ఎకరాకు నాలుగు పుట్లకు పైగా దిగుబడి రావడం పట్ల ఆమెహర్షం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి, పౌరసరఫరాల శాఖ మంత్రిని ఆదేశించడం ద్వారా కేవలం 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూశారని కొనియాడారు. రైతు పక్షపాతిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.