ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

జర్నలిస్ట్ లకు ఆర్డీవో సూచన

తాడేపల్లిగూడెం,(స్వతంత్ర ప్రభ)

ప్రతి నిత్యం వృత్తిపరమైన ఒత్తిడితో సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులు వారి వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ ఆర్డీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి సూచించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు తాడేపల్లి గూడెం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో  జర్నలిస్టులకు నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో కలెక్టర్ నాగరాణి ఉచిత వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇందులో భాగంగా ఇటీవల రెవెన్యూ శాఖలోని విఆర్వోలు, వీఆర్ఏలకు వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. ఇప్పుడు సమాజం కోసం పని చేసే జర్నలిస్టుల కోసం కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. జర్నలిస్టు అంటే సమాజానికి దిక్సూచి లాంటి వారని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టు ఆరోగ్యంగా ఉంటే సమాజం మేలు కోసం మరింత సమర్థవంతమైన సేవలు అందించగలుగుతారు అన్నారు. ముందుగా అక్రిడిటేషన్ జర్నలిస్టులకు మాత్రమే అని చెప్పినప్పటికీ  పలువురి విజ్ఞప్తి మేరకు వచ్చిన వారందరికీ వైద్య సేవలు అందించే ఏర్పాటు చేశామన్నా రు. తహసిల్దార్ తలారి రాజరాజేశ్వరి మాట్లాడుతూ కలెక్టర్ కల్పించిన ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు అందించడం సహజమే అయినప్పటికీ జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మెరుగైన రీతిలో వైద్య సేవలు అందేలా ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జే.విజయలక్ష్మి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటీవల వీఆర్వోలు, వీఆర్ఏల కు నిర్వహించిన శిబిరం ఎంతో విజయవంతమైందన్నారు. అదే రీతిన జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించు కుని కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు. అక్రిడిటేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా విలేకరులు ఎవరు వచ్చినా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వైద్య సేవలు అందిస్తామని ఆమె ప్రకటించారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాలకు చెందిన విలేకరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు వివిధ రకాల స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లాలో కలెక్టర్  చొరవ తీసుకుని జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం పట్ల పాత్రికేయులు ధన్యవాదాలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *