చీడిగొంది గ్రామంలో సమస్యలు తిష్ట!

సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీలు ఆవేదన!

అంగన్వాడీ కేంద్రం కోసం 10 సంవత్సరాలు నుంచి నిరీక్షణ…

నూతన పాఠశాల భవనం ఏర్పాటు చేయండి మహా ప్రభో….

ఎ.ఎస్.అర్ జిల్లా, (స్వతంత్ర ప్రభ)

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దేవరాపల్లి గ్రామ పంచాయతీకి చెందిన చీడిగొంది గ్రామంలో సమస్యలు తిష్ట. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆదివాసీ గిరిజనులు. దీనికి సంబంధించి స్థానికులు ఇచ్చిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చీడిగొంది గ్రామంలో ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రం లేదు. రెండు గ్రామాలకు కలిపి లక్కవరం అనే గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఉంది. అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళాలంటే సుమారు 2.5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాలి. దీంతో పిల్లలు మరియు బాలింతలు ప్రతిసారి సెంటర్ కి వెళ్లి పౌష్టికాహారం తీసుకోవడానికి అవస్థలు పడుతున్నారు. గ్రామానికి దూరంగా ఉన్న లక్కవరం గ్రామంలో ప్రతి రోజు పిల్లలు వెళ్లాలంటే చాలా కష్టతరంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఈ విషయాన్ని ఐసిడిఎస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని, ఇటీవల గూడెం కొత్తవీధి మండలానికి సంబంధించి విడుదల చేసిన 57 నూతన అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు లిస్ట్ లో 6 పివిటిజి గ్రామాలు మాత్రమే ఉన్నాయని, ఆ లిస్ట్ లో మా గ్రామం పేరు లేదని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీన పాడేరు ఐటిడిఏ లో జరిగే మీ కోసం కార్యక్రమంలో చీడిగొంది గ్రామంలో మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసి, ఆ గ్రామంలో నూతన అంగన్వాడీ టీచర్ ను నియమించాలని అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి కి వినతి పత్రం సమర్పించినట్టు జి.పాపారావు తెలిపారు. ఈ వినతి పత్రంలో తాము ఎదుర్కొంటున్న సమస్యను క్లుప్తంగా కలెక్టర్ కు వివరించారు. ముఖ్యంగా మా గ్రామంలో 50 కుటుంబాలు ఉన్నాయని, అంగన్వాడీ కేంద్రం కోసం సుమారు 10 సంవత్సరాలు నుంచి ఎదురు చూస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. అదేవిధంగా చీడిగొంది గ్రామంలో మరో సమస్య నెలకొన్ని ఉంది. ఎంపీపీ ప్రభుత్వ పాఠశాల ప్రస్తుతం పడిపోయే స్థితిలో ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు పిల్లల్ని పంపించాలన్న భయంగా ఉంది అని గ్రామస్తులు చెబుతున్నారు. ఏ సమయంలో ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్ధితిలో స్కూల్ భవనం ఉందని స్థానిక గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే పాఠశాలకి సంబంధించిన వంట గది నిర్మాణం కూడా సగం వరకు కట్టి ఆపేశారని, మరుగుదొడ్లు నిర్మాణం పనులు కూడా పూర్తి చేయలేదని, పాఠశాల కపౌండ్ గోడ కూడా లేదని, అలాగే స్కూల్ లో విద్యుత్, మంచినీటి సౌకర్యం కూడా లేదని చీడిగొంది గ్రామస్తులు వాపోతున్నారు. అలాగే పాఠశాలలో పనిచేసే స్వీపర్ కూడా లేరని, కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇటీవల ఇదే సమస్య గురించి పాడేరు ఐటిడిఏ గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు వినత పత్రం సమర్పించినట్టు వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే విద్య సంవత్సరం నాటికి ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కి దరఖాస్తు సమర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *