దేవాదాయశాఖ మంత్రి ఆనం
నెల్లూరు, ( స్వతంత్ర ప్రభ)
పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 27వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల కోసం అన్ని శాఖలు ముందుగానే సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం ప్రశాంతంగా జరిగేలా క్యూలైన్లు, బారికేడింగ్, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళా భక్తుల సంఖ్య పెరిగే అవకాశమున్నందున ఆర్టీసీ అధికారులు అధిక సంఖ్యలో బస్సులు నడపాలని ఆదేశించారు. విద్యుత్, పోలీస్, ఫైర్, మెడికల్, ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు భక్తుల అవసరాల మేరకు అన్ని సదుపాయాలు కల్పించాలని, అగ్నిమాపక వాహనాలు, 108 అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. భక్తులకు తాగునీరు, అన్నదానం సౌకర్యాలు కల్పించడంతో పాటు నిరంతర వైద్య సేవల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హనుమంతుని సేవ, గరుడ సేవ, కళ్యాణ ఉత్సవం రోజుల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, మాలకొండ, కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాల తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 832 కోట్లు మంజూరు చేసినట్లు, టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ. 750 కోట్లతో ఐదువేలకుపైగా భజన మందిరాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నిబద్దతతో పనిచేస్తున్నారని, ఈనెల 16న రాష్ట్ర సచివాలయంలో సుమారు మూడు గంటలకు పైగా దేవాదాయ శాఖపై సీఎం సమీక్షించి ఆలయాల అభివృద్ధికి కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. పెంచలకోన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ఇటీవల రూ. 6.50 కోట్లు మంజూరు చేసినట్లు, బ్రహ్మోత్సవాల అనంతరం పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంపై కూడా ఇంజనీరింగ్ అధికారులు, ఆగమ పండితులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.