
కాకినాడ (స్వతంత్ర ప్రభ)
స్థానిక జెఎన్టీయూకే సెనేట్ హాల్లో మంగళవారం హేమలలిత రచించిన “ఆమె నడిచినంత మేర – రాజ్యాంగం న్యాయ వ్యవస్థ” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐ.సి.సి (ICC) ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఉపకులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు రాజ్యాంగ విలువల పట్ల అవగాహన కలిగి బాధ్యతగల పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. రచయిత్రి హేమలలిత మహిళల సమస్యలు మరియు పోక్సో (POCSO) చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించగా, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. పద్మరాజు క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వ వికాసం అవసరమని తెలిపారు. న్యాయవాది కె.ప్రసన్న రాణి చట్టాలపై అవగాహనతో ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రొఫెసర్ యు.వి. రత్న కుమారి సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్లు, అధ్యాపకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.