ఏయూ వీసీ, సీపీతో కలిసి ఏయూలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
విశాఖపట్నం (స్వతంత్ర ప్రభ)
ఏయూ శతాబ్ధి ఉత్సవ ముగింపు వేడుకలకు, ప్రముఖుల పర్యటనలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. ఈ నెల 27న ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న ఏయూ శతాబ్ధి ఉత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లను ఏయూ వీసీ జి.పి. రాజశేఖర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి మంగళవారం సాయంత్రం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్నంగా పరిశీలించారు. ప్రధాన వేదిక, దానికి అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్న వేదికలను చూశారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు, ఈవెంట్ ఆర్గనైజర్ కు తగిన సూచనలు చేశారు. ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు విచ్చేస్తున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. పెవిలియన్, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే వేదికలను, గ్రీన్ రూమ్ లను పరిశీలించటంతో పాటు, కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులకు సీటింగ్ ఏర్పాట్లు, ఇతర వసతుల కల్పనపై ఈవెంట్ నిర్వాహకుడిని అడిగి తెలుసుకున్నారు.ప్రముఖుల రాకపోకలు, హెలిప్యాడ్ నిర్వహణ, రూట్ మ్యాప్, కార్యక్రమం జరిగే వేదిక మ్యాప్ లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. అతిథులు, విద్యార్థులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయాలని, తగినన్ని టాయిలెట్లు సమకూర్చాలని, తాగునీరు, స్నాక్స్ అందించేందుకు వీలుగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పవర్ బ్యాకప్ ఉండేలా, తగినన్ని జనరేట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గ్యాలరీలకు ఇన్ఛార్జులను నియమించటంతో పాటు, వారు ఒకరోజు ముందే వచ్చి గ్యాలరీల పరిస్థితిని, అక్కడికి ఎలా చేరుకోవాలని చూసుకోవాలని సూచించారు. 23, 24వ తేదీ సాయంత్రానికి ఏర్పాట్లను పూర్తి చేయాలని నిర్దేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని, రోజుకు 100 మంది చొప్పున నియమించి పనులు చేయాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణకు అనుగుణంగా కంట్రోల్ రూమ్ పెట్టాలని చెప్పారు.పర్యటనలో వారితో పాటు డీసీపీ విజయ్ మణికంఠ, విశాఖపట్టణం ఇన్ఛార్జి ఆర్డీవో శేషశైలజ, వివిధ విభాగాల అధికారులు, ఏయూకు చెందిన అధికారులు ఉన్నారు.