ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్


విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
జివిఎంసి సౌత్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక రెవెన్యూ (ట్యాక్స్) మేళాను దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సి.హెచ్. వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, జివిఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక రెవెన్యూ మేళాలు ప్రజలకు ఆస్తి పన్ను సంబంధిత సేవలను ఒకేచోట వేగవంతంగా అందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆస్తి పన్ను సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.జివిఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ మేళాలు నిర్వహించబడుతున్నాయి. ఈ మేళాలలో కొత్త ఆస్తి పన్ను అసెస్‌మెంట్, యాజమాన్య మార్పిడి, ఆస్తి విభజన, భవన మార్పులు, రివిజన్ పిటిషన్లు తదితర సేవలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబడినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.