గిరిజన గడపలకు ఉచిత సోలార్ విద్యుత్జిల్లా కలెక్టర్ నిషాoతి టి

అరకు, (స్వతంత్ర ప్రభ)
జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. అరకు వ్యాలీ మండలం, గరుడగుడ గ్రామం, పెద్దలబుడు గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కార్యక్రమాన్ని అధికారికంగా జిల్లా కలెక్టర్ టి నిషాoతి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా మొత్తం 10,102 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులను లబ్ధిదారులుగా గుర్తించారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 20.20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. ఒక్కో కిలోవాట్‌కు సుమారు ₹61,528 ఖర్చు అవుతుండగా, ప్రతి ఇంటికి దాదాపు ₹1,23,057 విలువైన సోలార్ ప్యానెల్స్‌ను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్నాయి అన్నారు. లబ్ధిదారులు ఎటువంటి ఖర్చు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గిరిజన ఇళ్లపై ఏర్పాటు చేసే ఈ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వారి సొంత అవసరాలకు వాడుకోవచ్చుని , అదనంగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా గ్రామానికి, రైతులకు మేలు జరుగుతుందని తెలియజేశారు.ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు శాశ్వతంగా తీరడమే కాకుండా, విద్యుత్ బిల్లుల భారం తగ్గి వారి సామాజిక-ఆర్థిక పరిస్థితుల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి స్పష్టం చేశారు. పర్యావరణ హితమైన సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రతి గిరిజన ఇల్లు స్వయంసమృద్ధి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆనందం వ్యక్తం చేశారు.