విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
వన్ టౌన్ పరిధిలోని పప్పుల వీధికి చెందిన ఒక వివాహిత మహిళ, తన భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఒక లేఖ రాసిపెట్టి, తన మంగళసూత్రాలు, మొబైల్ ఫోన్‌ను అక్కడే వదిలేసి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అది గమనించిన ఆమె భర్త తీవ్ర ఆందోళనతో వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుపై వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పూడి వరప్రసాద్ తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు. సమయాన్ని వృధా చేయకుండా దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాలించి, కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే విశాఖపట్నం బీచ్‌లో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ మహిళను గుర్తించి, సమయస్ఫూర్తితో రక్షించారు.మహిళను సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం, వన్ టౌన్ సిఐ పూడి వరప్రసాద్ భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు తెచ్చే ముప్పును వివరించి, వారి మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించి ఇద్దరినీ కలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు చేసిన అరగంటలోనే తమ మనిషిని ప్రాణాలతో కాపాడటంపై భర్త, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇన్స్పెక్టర్ పూడి వరప్రసాద్, ఎస్సై శ్రీనివాస్ మరియు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీసుల ఈ సత్వర స్పందన పట్ల స్థానికులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.