ఉన్నతాధికార కమిటీతో విచారణ జరిపించాలని బీజేపీ నేత మాధవీలత డిమాండ్
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు సంజీవని లాంటి విశాఖపట్నం ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి కింగ్ జార్జ్ హాస్పిటల్ (కె జి హెచ్) లో ఇటీవల కాలంలో పేద రోగులకు అందుతున్న వైద్య సేవలు, అక్కడ నెలకొన్న దయనీయ పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర ఎస్సీ నాయకురాలు మాధవీలత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను కలిసి, అక్కడ ఉన్న సమస్యలను వివరిస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఇటీవల పెందుర్తికి చెందిన సౌజన్య అనే మహిళా రోగి సహాయకురాలు కె.జి.హెచ్ లో తాము పడుతున్న అవస్థలపై ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాలలో మరియు వార్తా ఛానళ్లలో ఒక వీడియో విడుదల చేశారని, అందులో ఆమె పేర్కొన్న అంశాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని మాధవీలత ఈ సందర్భంగా గుర్తు చేశారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో చేరిన తన తల్లిని ఓపీ ల పేరుతో స్పష్టమైన మార్గదర్శకత్వం లేకుండా హాస్పిటల్ చుట్టూ పది సార్లు పైగా తిప్పించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, చదువుకున్న వారికే అక్కడ గందరగోళంగా ఉంటే, నిరక్షరాస్యులైన పేద ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వార్డులలో కనీసం కూర్చోవడానికి బెంచీలు, ఉక్కపోతకు తట్టుకోవడానికి ఫ్యాన్లు లేవని, వైద్య పరీక్షలు చేయడానికి అవసరమైన కనీస ఎక్విప్మెంట్లు, బీపీ మరియు షుగర్ తనిఖీ చేసే సాధారణ పరికరాలు కూడా అందుబాటులో లేవని వినతిపత్రంలో ఆరోపించారు.
మరోవైపు హాస్పిటల్‌లోని సీనియర్ నర్సింగ్ స్టాఫ్, అనుభవజ్ఞులైన వైద్యులు గదుల్లో కూర్చుని కాలక్షేపం చేస్తుండగా, ఎలాంటి పర్యవేక్షణ లేకుండా కేవలం జూనియర్ ట్రెయినీలతో సెలైన్ పెట్టించడం, ఇంజెక్షన్లు ఇప్పించడం లాంటి పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. సీనియర్లు పక్కన ఉండి గైడ్ చేయకపోవడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, ఈ సమస్యలపై ప్రశ్నిస్తే అక్కడ ఉన్న నర్సింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు రోగుల పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల అత్యంత దారుణంగా, అసభ్య పదజాలంతో అరుస్తూ, మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. హాస్పిటల్‌లోని 90% పైగా సిబ్బంది..!? ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన కె.జి.హెచ్ కు నిరుపేద, ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన వర్గాల ప్రజలే అధికంగా వైద్యం కోసం వస్తుంటారని, అలాంటి వారి పట్ల సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించడం మరియు కనీస వైద్య సదుపాయాలు కల్పించకపోవడం తీవ్రంగా ఖండించదగినదన్నారు. కావున, ఈ విషయాలపై ఉన్నతాధికార కమిటీతో తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులైన నర్సింగ్ స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు, వైద్య పరికరాలు మెరుగుపరిచేలా తగిన చర్యలు చేపట్టాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి.వి.ఎం.సి మెంబెర్ (ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్) చొక్కకుల రాంబాబు, విశాఖపట్నం ఎస్సీ మోర్చా నాయకురాలు సుశీల తదితరులు పాల్గొన్నారు.