సోంపేట, మార్చి 30 (స్వతంత్ర ప్రభ)
శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న పట్టణాల్లో పిల్లల శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, వృద్ధుల ప్రశాంతత కోసం పార్కులు ఎంత అవసరమో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్, సంఘసేవకురాలు డాక్టర్ సీపాన గుణవతి గుర్తు చేశారు.సోంపేటలోని చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధి లేక కట్టిన గోడలు కూలి పోయే స్థితిలో ఉండటం పట్ల ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2016 నవంబర్ 30న 13వ ఆర్థిక సంఘం నిధులతో రూ. 15.60 లక్షలు ఖర్చు చేసి ప్రహరీ గోడ నిర్మించినప్పటికీ, తొమ్మిది సంవత్సరాలుగా పార్క్ ప్రజలకు ఉపయోగం కాని దుస్థితిలో ఉండటం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని ఆమె విమర్శించారు.9సంవత్సరాల సుధీర్ఘ కాలం కింద లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులు పెట్టినా, పార్క ప్రజల ప్రొయోజనాలకు వినియోగ పడకుండా పోవటం అత్యంత బాధ్యతా రహితమనిఅన్నారు. దీని పలిత మే ప్రజా ధనానికి నష్టం కలిగించింది.ఈ పార్క్ పిల్లలకు, యువతకు, వృద్ధులకు ప్రాణ వాయువులాంటిది. దీన్ని ఇలాగే సాగనివ్వడం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు నష్టం కలిగిస్తుందని అన్నారు.పార్క్‌ను ప్రజా ప్రయోజనాలకు వెంటనే అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ పార్క్‌ను దత్తతగా తీసుకుని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను జిల్లా కలెక్టర్‌కు గతంలో సమర్పించినప్పటికీ, ఆయన స్పందించకపోవడం విచారకరమని ఆమె అన్నారు.శ్రీకాకుళం పట్టణంలో కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఒక పార్క్ ను గతంలో దత్తత నిచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు.సోంపేట పార్క్ కీ సంబంధిత పత్రాలు, నిధుల వినియోగ వివరాలు, ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సమగ్ర సమాచారం కోరుతూ సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ ) కింద రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శికీ సోమవారం నాడు వినతిపత్రం పంపినట్లు డాక్టర్ గుణవతి తెలిపారు. ఈ పిటిషన్ కు సమాధానం ఇవ్వడం కార్యదర్శి రాజ్యాంగ బద్ధ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ (జి) పర్యావరణ పరిరక్షణ, ప్రజా వనరుల సంరక్షణ—ప్రకారం, ప్రజా ప్రయోజనాల కోసం పార్క్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి దత్తత ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలించాలని డాక్టర్ గుణవతి డిమాండ్ చేశారు.“నిధులు లేక అభివృద్ధి సాధ్యం కాదని అధికారులు చెబితే, మా సంఘం తరుపున పార్క్‌ను పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు.ప్రభుత్వానికి భారం తగ్గుతుంది—ప్రజలకు మెరుగైన సదుపాయాలు లభిస్తాయి. ఇలాంటి ప్రజా ప్రయోజన ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి.”పిల్లలు ఆటలు ఆడే ప్రదేశం లేక వీధుల్లో, ట్రాఫిక్ మధ్య ఆడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రజలు ఉదయం, సాయంత్రం నడవటానికి సురక్షిత ప్రదేశం కోసం ఎదురుచూస్తున్నారని ఆమె తెలిపారు. సోంపేట పట్టణ అభివృద్ధికి పార్క్ పునర్నిర్మాణం మొదటి అడుగని, మీరు పార్కు ను అభివృద్ధి చేయండి, మీ వద్ద నిధులు లేకపోతె మాకు ధత్తత ఇవ్వండి అని డాక్టర్ గుణవతి అన్నారు.