ఇచ్చాపురం, (స్వతంత్ర ప్రభ)
ప్రజాసేవకు ప్రతీకగా నిలుస్తున్న వైద్యరంగం ఒకప్పుడు “వైద్య నారాయణ హరి” అన్న గౌరవానికి ప్రతిరూపంగా ఉండేది. అయితే నేటి వాణిజ్య వాతావరణంలో కొంతమంది వైద్యులు ఈ పవిత్ర వృత్తి విలువను దిగజార్చుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో క్యాజువాలిటీకి అడుగుపెట్టిన వెంటనే రోగి పరిస్థితిని పరిశీలించకుండానే వేల రూపాయల మందుల జాబితా రాయడం, చిన్న వ్యాధులకే ఖరీదైన పరీక్షలు తప్పనిసరి చేయడం, వంద రూపాయలు విలువ చేసే మందుల బదులుగా అధిక ధరల మెడిసిన్‌ను కొనిపించడంలాంటి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.లండన్‌లో చదివానని, ఎఫ్ ఆర్ సి ఎస్ వైద్యుడిని అని చెప్పుకుంటూ సాధారణ జ్వరం – జలుబుకి సరిపడే డోలో650, సిట్రోజిన్ వంటి మందులను ఇవ్వకుండా రోగికి ఆర్థిక భారమే మిగిల్చే స్థితి ఏర్పడింది.ఇలాంటి పరిస్థితుల్లో, వైద్యవృత్తిలో నైతికతను, మానవత్వాన్ని అంకితంగా నిలబెట్టిన ఆదర్శ వ్యక్తి డాక్టర్ఉలాల కోదండరాం. ఇచ్చాపురానికి చెందిన యాదవ కుల బీసీ వర్గ నాయకుడైన ఆయన, ఉన్నత స్థాయిలో వైద్య విద్యను అభ్యసించి విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సహాయ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ప్రభుత్వ వైద్య రంగంలో మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రజలకు అందుబాటు వైద్యం అందించాలని సంకల్పించిన డాక్టర్ కోదండరాం, తన ప్రతిష్టాత్మక ఉద్యోగానికి స్వస్తి పలికారు.తన స్వగ్రామమైన ఇచ్చాపురంలో సర్వ సదుపాయాలతో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించి, పేదలకు అతి తక్కువ ఫీజులతో, ఆప్యాయతతో, మానవతా ధోరణితో వైద్యసేవలను అందిస్తున్నారు. సేవే పరమధర్మమన్న భావంతో రోజుకు వందలాది మంది బాధితులకు చికిత్స చేయడం, అత్యవసర సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులున్న రోగులను ఉచితంగా చూసుకోవడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది.డాక్టర్ కోదండరాం చేసిన ఈ ప్రజాసేవా కార్యక్రమాలను గుర్తిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ సంఘసేవకురాలు డాక్టర్ సిపాన గుణవతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.జి. ప్రసాద్, జిల్లా సలహాదారుడు ఎల్. గోవిందరాజులు, ఇచ్చాపురం మండల బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ శాలిన ఢిల్లీ రావు, మహిళా కన్వీనర్ సాలిన పద్మ బుధవారం నాడు ఆయనకు సాలువ కప్పి పుష్పగుచ్ఛాలు అందిస్తూ ఘన సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ —“వైద్యరంగం వాణిజ్యం వైపు పరుగులు తీస్తున్న ఈ యుగంలో, పేదలు, వెనుకబడిన వర్గాల కోసం తన ప్రతిష్టాత్మక వృత్తిని వదిలి గ్రామీణ ప్రాంతంలో సేవ చేయడం డాక్టర్ కోదండరాం మహోన్నతతను తెలియజేస్తుంది. ఇటువంటి వైద్యులు సమాజానికి దిక్సూచికలు. బీసీ వర్గానికి చెందిన ఓ వైద్యుడు ఇచ్చాపురం వంటి ప్రాంతంలో మానవతా వైద్య సేవలు అందించడం గర్వించదగ్గ విషయం” అని అభిప్రాయపడ్డారు.తనను ఘనంగా సన్మానించినందుకు డాక్టర్ కోదండరాం బీసీ సంక్షేమ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ,“ప్రజల ఆరోగ్యం కోసం నిస్వార్థంగా పనిచేయడం నా బాధ్యత, నా ధ్యేయం. ఇచ్చాపురం ప్రజలు నాకు చూపుతున్న ప్రేమే నాకు పెద్ద పురస్కారం” అని పేర్కొన్నారు.అత్యాధునిక సౌకర్యాల తో కూడిన సేవలను గ్రామ స్థాయిలో అందించడం ద్వారా డాక్టర్ కోదండరాం వైద్యరంగానికి కొత్త దిశను చూపిస్తున్నారని స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.