పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్..
తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ)
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో హెచ్.పి పెట్రోల్ బంకు వద్ద నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసన చేపట్టారు. తొలుత వైఎస్సార్ సీపీ కార్యాలయం నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీగా నినాదాలు చేస్తూ వెళ్లారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వానికి ముందు చూపులేదన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అసలు వ్యవసాయం వద్దన్న ఈ చంద్రబాబు వ్యవసాయ రైతులు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్నారని మండి పడ్డారు. రైతులు ఇబ్బందులలో ఉంటే వ్యవసాయ శాఖామంత్రి ఫారెన్ టూర్ కి వెళ్లారని ఎద్దేవాచేశారు. వ్యవసాయానికి అవసరమైన డీజిల్ అందుబాటులో ఉంచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. పంట కోతకు వచ్చిన సమయంలో ట్రాక్టర్ లకు, వ్యవసాయ పరికరాలకు డీజిల్ అత్యంత అవసరమని, భారతదేశంలో ఎక్కడా లేని డీజిల్ కొరత ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఎందుకుందని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు డీజిల్, పెట్రోల్ అందుబాటులోకి తీసుకురాకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రతీ పెట్రోల్ బంకు లను ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.