బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆగ్రహం
విశాఖ పశ్చిమం,(స్వతంత్ర ప్రభ)

విశాఖలోని కంచరపాలెం ప్రాంతంలో ఒక సామాన్య దళిత మహిళా భక్తురాలు దశాబ్దాల క్రితం భక్తిశ్రద్ధలతో నిర్మించుకున్న ఆలయంపై స్థానిక కార్పొరేటర్ కన్ను పడటం గర్హనీయమని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాధవిలత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం అభ్యంతరం చెప్పని చోట, ఇప్పుడు అధికార అండతో ఆ ఆలయాన్ని లాక్కోవాలని చూడటం రాజకీయ అరాచకత్వానికి పరాకాష్ట అని ఆమె విమర్శించారు.ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ, ఎంతో కష్టపడి ఆలయాన్ని నిర్మించి, నిర్వహిస్తున్న సదరు దళిత మహిళను కార్పొరేటర్ భయభ్రాంతులకు గురిచేయడం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. “ఆ గుడి నాకు ఇచ్చేయండి, నేనే నిర్వహిస్తాను” అని బెదిరించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాప్రతినిధిగా ప్రజలను కాపాడాల్సింది పోయి, భక్తుల ఆస్తులను, వారి మనోభావాలను దెబ్బతీయడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంలో ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం తలదూర్చకపోయినా, కార్పొరేటర్ తన సొంత ప్రయోజనాల కోసం దళితులను వేధించడంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.ఒక దళిత మహిళ నిర్మించిన ఆలయాన్ని బలవంతంగా లాక్కోవాలని చూస్తే బీజేపీ ఎస్సీ మోర్చా తరపున తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని మాధవిలత హెచ్చరించారు. బాధితురాలికి అండగా నిలబడి, ఆ ఆలయ పవిత్రతను, ఆమె హక్కును కాపాడే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. పేదల దైవభక్తిని కూడా రాజకీయం చేయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.