కిండింగిలో ‘మృత్యువు’ పొంచి ఉంది..
విద్యుత్ శాఖాధికారులారా.. ఇకనైనా మేల్కొంటారా?
పాడేరు, (స్వతంత్ర ప్రభ)
అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకునే వరకు వేచి చూస్తారా? ప్రజల భయాందోళనలు మీకు వినపడవా? అంటూ కిండింగి గ్రామస్తులు విద్యుత్ శాఖ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.గ్రామంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, మృత్యువులా పొంచి ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎప్పుడు ఎవరిని కబళిస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు.గ్రామంలోని సచివాలయం, డి.ఆర్ డిపో వంటి కీలక కార్యాలయాలకు వెళ్లే దారిలోనే ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. మరి ముఖ్యంగా పాఠశాల చదువు నిమిత్తం అదే మార్గంన విద్యార్థిని, విద్యార్థులు నిత్యం వందలాది మంది ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ దారి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డుకు ఆనుకొని, ఇళ్లకు అతి సమీపంలో ఉండటంతో అడుగు తీసి అడుగు వేయాలంటేనే జనం జంకుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మొద్దునిద్ర వీడి ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అలాగే విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, వినతి పత్రాలు ఇచ్చినా విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ‘మాకు సంబంధం లేదు’ అన్నట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.”ఏ క్షణంలో వైర్లు తెగిపడతాయో.. ఏ నిమిషంలో షార్ట్ సర్క్యూట్ అవుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు ఆడుకుంటూ అటువైపు వెళ్తే వారి పరిస్థితి ఏమిటని తల్లడిల్లిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? అని గ్రామస్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను జనసంచారం లేని చోటికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యాన్ని వీడి పరుగులు పెట్టకపోతే, గ్రామస్తులంతా కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.