కాకినాడ, (స్వతంత్ర ప్రభ)

జెఎన్టియుకె కాకినాడ విశ్వవిద్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక.రామారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి
విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.సిఎస్ఆర్ఎకె.ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఓఎస్టీ డాక్టర్ డి. కోటేశ్వరరావు సమన్వయం చేశారు.ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొ.సిఎస్ఆర్.ప్రసాద్ మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని పేర్కొన్నారు.తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన అరుదైన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీరంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ఆయన రాజకీయ రంగంలో కూడా ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ
పథకాలను అమలు చేశారని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి
చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఎన్టీఆర్
విశేష సేవలు అందించారని తెలిపారు. యువత ఎన్టీఆర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని
సమాజ సేవలో ముందుండాలని సూచించారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల
నిబద్ధత ప్రతి ఒక్కరూ అలవరచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజ అభివృద్ధికి విలువలతో కూడిన నాయకత్వం ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి మహానుభావుల జయంతి వేడుకలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఉపకులపతి అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్లు, సీనియర్ ప్రొఫెసర్లు, విభాగాధిపతులు,అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.