
విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు 31వ మరియు 27వ వార్డుల్లోని చాకలిపేట, చావలి వారి వీధి, హిందూ ముస్లిం కాలనీ, డైమండ్ పార్క్ రోడ్, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది.ఈ పర్యటనలో భాగంగా ముఖ్యంగా 27వ వార్డులో పారిశుధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం చావలి వారి వీధి మరియు హిందూ ముస్లిం కాలనీ ప్రాంత ప్రజలతో మాట్లాడి, ఇంటింటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు గానీ లేదా చెత్త సేకరణ వాహనానికి గానీ ప్రతి ఇంటి నుండి ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడి వేరుగా వర్గీకరించి అందించాలని సూచించారు.అదేవిధంగా ప్రతిరోజు ఒకే సమయానికి చెత్త సేకరణ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని, అలాగే వాణిజ్య సముదాయాల్లో డస్ట్‌బిన్ లేకుండా కాలువల్లో చెత్త వేస్తున్నట్లుగా గుర్తించినచో అపరాధ రుసుం విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అలాగే 27వ వార్డులో ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతను తనిఖీ చేయడం జరిగింది.అదేవిధంగా అధికంగా చెత్త పేరుకుపోతున్న ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆదేశించారు.మరియు ఇచ్చిన ఆదేశాలను పాటించని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కృష్ణంరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్, వాటర్ సప్లై మరియు పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు, అలాగే సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు.