ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ)
త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తన నిరాడంబరతను మరోసారి చాటుకున్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రముఖ ఫుడ్ కోర్ట్ ‘ఈట్ స్ట్రీట్’ వద్ద ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సామాన్య ప్రజల మధ్య కూర్చుని ఆయన అల్పాహారం స్వీకరించి, టీ తాగారు. కేంద్రమంత్రి తమ మధ్యకు రావడం తోపాటు తమతో మమేకమై మాట్లాడటంతో స్థానికులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.బిజెపి ఆధ్వర్యంలో జరిగిన పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగించుకుని తిరిగి భీమవరం వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో తాడేపల్లిగూడెంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా స్థానిక ఈట్ స్ట్రీట్‌లో తోటి నాయకులతో కలిసి ఆయన సందడి చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, సీనియర్ బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.





