
విశాఖ దక్షిణం, జూలై:16(స్వతంత్ర ప్రభ)
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు 27వ వార్డులోని డైమండ్ పార్క్, నెహ్రూ బజార్ రోడ్, శ్రీనగర్, రాజేంద్రనగర్, శంకరమఠం, ద్వారకానగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్యం, ప్రజా సౌకర్యాలు మరియు పన్నుల అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.పర్యటన సందర్భంగా ప్రజలు రోడ్లపై విచక్షణారహితంగా చెత్త వేస్తున్న ప్రాంతాలను గుర్తించిన జోనల్ కమిషనర్, సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చెత్త వేస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి జరిమానాలు విధించడం ద్వారా ఇటువంటి చర్యలను పూర్తిగా అరికట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.అదేవిధంగా, నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న కొన్ని భవనాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటికి కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ విధించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.27వ వార్డులోని గెడ్డలను పరిశీలించిన సందర్భంగా గెడ్డల్లో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో గెడ్డల్లో పేరుకుపోయే చెత్తను యంత్రాల సహాయంతో సులభంగా తొలగించేందుకు అవసరమైన ర్యాంపులు నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణను ప్రతిరోజూ సమర్థవంతంగా నిర్వహించాలని, పారిశుధ్య కార్మికులను ప్రణాళికాబద్ధంగా వినియోగించి ప్రధాన రహదారుల స్వీపింగ్‌ను ప్రతిరోజూ ఉదయం 7.00 గంటలకే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పారిశుధ్య అధికారులకు జోనల్ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కృష్ణంరాజు, శానిటరీ సూపర్వైజర్ నీలిమ, ఇంజనీర్ విజయ్ కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.





