జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల..
నెల్లూరు (స్వతంత్ర ప్రభ )
నెల్లూరు జిల్లాలో 2047 నాటికి 50 శాతం హరితావరణం సాధించే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం నిర్దేశించిన హరిత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్, హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో జిల్లా అటవీ కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, నీటిపారుదల శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రోడ్లు & భవనాల శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, అటవీ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులతో హరిత కార్యక్రమాల అమలుపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పలు హరిత కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 2047 నాటికి 50 శాతం హరితావరణ లక్ష్య సాధన, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ నర్సరీ యోజన, నమోవన్ – నగర్ వన్ యోజన ప్రతి గ్రామంలో తాటి తోటల ఏర్పాటు, గ్రామ పంచాయతీల ఉమ్మడి భూముల్లో కార్యక్రమం కింద కలప జాతుల మొక్కల పెంపకం, సీడ్ బాల్ డిస్పర్సల్ పీఎం-ఆర్‌కేవీవై అగ్రో ఫారెస్ట్రీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.హరిత కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రతి శాఖ తన పరిధిలోని రహదారుల పొడవు, కాలువల వివరాలు, చెరువుల జాబితా, మొక్కలు నాటేందుకు అనువైన ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పాఠశాలల వివరాలు, స్కూల్ నర్సరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు, నమోవనాల ఏర్పాటు చేయగల ప్రాంతాలు, తాటి తోటల అభివృద్ధికి అనువైన స్థలాలు, గ్రామాల్లో కలప జాతుల మొక్కల పెంపకానికి అనుకూల భూములు, గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమానికి అనువైన ప్రాంతాల వివరాలను సమగ్రంగా సేకరించి త్వరితగతిన జిల్లా అటవీ శాఖకు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, ప్రతి కార్యక్రమానికి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, భూసార పరిరక్షణ, భూగర్భ జలాల వృద్ధి, జీవవైవిధ్య సంరక్షణకు హరిత కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారుఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి (టెరిటోరియల్) కె. మహబూబ్ బాషా, సోషల్ ఫారెస్ట్రీ జిల్లా అటవీ అధికారి ఎం. నాగార్జున రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి డి. వసుమతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్. బాలాజీ రావు, తదితరులు పాల్గొన్నారు.





