తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ)
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్సీ,ఎస్టీ,బీసీ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో, సమగ్రమైన కార్యాచరణ చేపట్టామని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పుస్తకాలు,బట్టలు,దుప్పట్లు తదితర వస్తువులతో కూడిన కిట్లను ఆదివారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి అరుణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు.గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం వసతి గృహలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తదితరాలను నిర్వీర్యం చేసి, ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలాఆంజనేయస్వామి బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రత్యేక శ్రద్ధ వహించారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన టవల్స్, రెండు నైట్‌డ్రెస్‌లు, బెడ్‌షీట్, ట్రంక్ బాక్స్ తదితర సామగ్రిని అందిస్తున్నారని అన్నారు. విద్యార్థులు తమ సొంత ఇంట్లో తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పటి కంటే మెరుగైన రీతిలో వసతిగృహాలు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు.ఈ సౌకర్యాలను చూసి మరికొందరు విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లలో చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.విద్యే శాశ్వత సంపద అనే విషయాన్ని గ్రహించి,విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకుఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల కోసంప్రభుత్వం కల్పిస్తున్న వసతుల గురించి, తల్లిదండ్రులకు, ప్రజలకు తెలియజేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.





