సరదాగా స్నానానికి వెళ్లి నీటిలో మునిగి ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
పెందుర్తి, (స్వతంత్ర ప్రభ)
విశాఖపట్నం నగర పరిధిలోని మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సరదాగా స్నానానికి వెళ్లిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులు నీటిలో దిగగా, దీపక్ (17), రామచంద్రరావు (18) అనే ఇద్దరు నీటి లోతును అంచనా వేయలేక ప్రమాదవశాత్తూ మునిగిపోయారు.
తోటి విద్యార్థులు వెంటనే పెందుర్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు వంటి లోతైన నీటి ప్రాంతాల్లో స్నానాలు చేయకుండా యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.





