విశాఖ దక్షిణం, జూలై:20(స్వతంత్ర ప్రభ)
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు 29, 30వ వార్డుల పరిధిలోని అఫీషియల్ కాలనీ, అజంతా రోడ్డు, కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, బెల్లం వినాయక టెంపుల్ రోడ్డు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా అఫీషియల్ కాలనీలోని అపార్ట్మెంట్లలో తడి, పొడి చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించి, అన్ని అపార్ట్మెంట్ల నుంచి తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ నిబంధనల అమలుకు సంబంధించి ప్రతి అపార్ట్మెంట్కు ఈరోజే నోటీసులు జారీ చేయాలని సూచించారు.పర్యటనలో భాగంగా రోడ్లపై చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఇంటింటి చెత్త సేకరణను పూర్తిస్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాల యజమానులు తమ షాపుల ముందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను ఇంటింటి చెత్త సేకరణ వాహనానికే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై అవసరమైతే జరిమానాలు విధించి వసూలు చేయాలని ఆదేశించారు.అనంతరం కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ నుండి ఏవిఎన్ కాలేజ్ వైపు వెళ్లే రోడ్డులో ఉన్న బడ్డీల యజమానులకు అవగాహన కల్పించి, తమ బడ్డీల పరిసరాల్లోని చెత్తను స్వయంగా శుభ్రపరచుకొని పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. ఆదేశాలను పాటించని పక్షంలో జరిమానాలు విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.తదుపరి కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్ను సందర్శించి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా నిర్వహించాలని సంబంధిత సంరక్షకునికి సూచించారు. టాయిలెట్ను నిరంతరం పరిశుభ్రంగా ఉంచి, అవసరమైన నిర్వహణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కృష్ణంరాజు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్కుమార్, శానిటరీ సూపర్వైజర్ నీలిమ, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రాజు, శానిటరీ సెక్రటరీలు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.





