అభయ్ ప్రొడక్షన్స్ ధనుంజయని అభినందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్..
32 కళారూపాలు.. 500 మందికి పైగా కళాకారులతో జానపద కళా ప్రదర్శన…
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
అభయ్ ప్రొడక్షన్స్ ధనుంజయ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జానపద కళావైభవం–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్ణా మార్కెట్ రోడ్డులోని క్రాంతి థియేటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన కళాకారులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా 32 రకాల కళారూపాలతో 500 మందికి పైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కళా ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.ఈ సందర్భంగా జానపద కళల వైభవాన్ని భవిష్యత్ తరాలకు పరిచయం చేసే ఉద్దేశంతో రూపొందించిన డాక్యుమెంటరీని పలువురు పెద్దలు అభినందించారు. కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ, ఈ మంచి ఆలోచనకు ధనుంజయ ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పెద్దలు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన కళాకారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.





